– కమ్యూనిజంపట్ల ఆయనకు సానుకూల దృక్పధం
– భారత కమ్యూనిస్టు పార్టీలో బ్రాహ్మణాధిక్యతే కారణం
అంబేద్కర్ మార్క్స్‌కు ఎందుకు దూరం జరిగాడు…. ? తొలినాళ్లల్లో కార్మిక వర్గ విశాల దృక్పధంతో ఆలోచించిన అంబేద్కర్ మార్క్సిజంపై ఎందుకు వ్యతిరేకత పెంచుకున్నాడు? మరుగున పడిన వర్గమే కులం అనే భావన కలిగిన అంబేద్కర్ కమ్యూనిజంపట్ల ఎందుకు విముఖత ఏర్పరుచుకున్నారు….?అందుకు ఆయనకు ఎదురైన అనుభవాలేమిటి? లోతుల్లోకి వెళ్లి పరిశోధిస్తే కొన్ని వాస్తవాలు కనిపిస్తాయి. అందుకు మన దేశంలోని కమ్యూనిస్టులు ఆయన పట్ల అనుసరించిన అశాస్త్రీయ విధానాలు మనకు దర్శనమిస్తాయి.
వాస్తవానికి కమ్యూనిస్టులు అప్పట్లో అంబేద్కర్‌ను కులం పేరుతో శ్రామికులను పోరాటాలకు దూరం చేసిన వాడిగా చూశారు. ఆ కారణంగానే 1952లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అంబేద్కర్‌కు అనుకూలంగా కులానికి ఓటు వేయొద్దని అప్పటి ప్రముఖ కమ్యూనిస్టు నేత డాంగే పిలుపునిచ్చారు. ఇదే తన ఓటమికి దారితీసిందని అంబేద్కర్ లో లోలోన రగిలిపోయారు. అంతే కాదు…బాంబే టెక్స్‌టైల్ మిల్స్‌లో పని చేస్తున్న దళితులు పనుల పరంగా, వేతనాల పరంగా వివక్షకు గురవుతున్న విషయాన్ని కమ్యూనిస్టు కార్మిక సంఘాలు విస్మరిస్తున్నాయని అంబేద్కర్ భావించారు. దళితులకు మిల్లులో గౌరవనీయమైన మర మగ్గాల దగ్గర కాకుండా అంటరాని పనుల్లో భాగస్వాములను చేస్తున్న విషయంపై అంబేద్కర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గ్రహించి కూడా కార్మిక సంఘాలు అప్రమత్తం కాలేకపోయాయి. 1928లో కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె పిలుపును వమ్ము చేస్తానని అంబేద్కర్ బెదిరిస్తేనే కానీ తమ తప్పులను సరిదిద్దుకోవడానికి సిద్ధపడలేదు.
వాస్తవానికి వర్గ పోరాటాలకు, సామాజిక విప్లవాలకు అంబేద్కర్ వ్యతిరేకం కాదు. మార్క్సిజంపై తనకు ఉన్న భావాలను ఆయన దాచుకోలేదు. ”నేను ఇక్కడి కమ్యూనిస్టుల కంటే ఎక్కువగా కమ్యూనిస్టు సైద్ధాంతిక గ్రంధాలు అనేకం చదివాను. కమ్యూనిస్టు తాత్వికతను ఎంత అందంగా చెప్పబడిందా పుస్తకాల్లో ! అవి ఆచరణలో పెట్టగలిగితే ఇప్పటికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఆ విధానంలో పని చేయగలిగితే రష్యాలో మాదిరిగానే భారత్‌లో కూడా కార్మిక వర్గ పోరాటాలు విజయం సాధించడం కష్టమేమీకాదు. అందువల్ల కార్మికవర్గ పోరాటాలు… అంటే కమ్యూనిస్టు సిద్ధాంతం మనకు చాలా దగ్గరగా ఉందని భావిస్తున్నాను” (జనత పత్రిక – 1938, ఫిబ్రవరి 15) అంటారు. భారతదేశంలో కార్మికవర్గ పోరాటాల ఆవశ్యకతను అంబేద్కర్ గుర్తించారు అనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు.
అయితే ఇదే సందర్భంలో పార్లమెంటరీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్‌తో పాటు అతని సన్నిహితులు కొందరు అంటరానివారి ప్రతినిధులుగా స్వతంత్ర కార్మిక సంఘాన్ని (ఇండిపెండెంట్ లేబర్ పార్టీ) స్థాపించారు. మతానికి, రాజకీయాలకు మధ్య అంతర్ సంబంధాల ఆవశ్యకతను అంబేద్కర్ గుర్తించాడనడానికి ఇది సూచన. దీనిలో రెండు పార్శ్వాలు ఉన్నాయని, ఒకటి సామాజికంగా అంటరానితనం కాగా.. రెండోది కార్మికులుగా అంటరానితనం అనుభవిస్తున్న స్థితిని ఆయన గుర్తించాడు. అప్పటికే సామాజిక అంటరానితనాన్ని గురించి ఆయన తన ప్రసంగాల్లో వివరిస్తూ వచ్చారు. రాజకీయ, ఆర్ధిక కారణాలు కూడా అగ్రకులాలు అంటరానివారిని అణచి వేసి ఉంచడానికి ఉపకరిసున్నాయని ఆయన అనేక సందర్భాల్లో విశ్లేషించారు.
బ్రాహ్మణులకు ఉన్న రాజకీయ, ఆర్ధిక సంబంధాలు ఒక వైపు, సమాజంపై బ్రాహ్మణీయ మత సంస్థల ప్రభావం మరొక వైపు … వీటన్నింటి కారణంగా అంటరానివారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అంబేద్కర్ ఆలోచనలు మార్క్సిజంవైపు సాగాయని చెప్పవచ్చు. ఇదే సమయంలో సామాజిక అసమానతలకు మార్క్సిస్ట్ చికిత్సా విధానాన్ని ఆయన సందిగ్ధంలో పడినప్పటికీ రాజకీయ, ఆర్ధిక హీనస్థితికి కారణమవుతున్న మత విధానం స్థానంలో దీని ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉందని గ్రహించాడు. కానీ.. ఆతరువాత తన ఆలోచనల్లో వచ్చిన పరిణామం కారణంగా రష్యా విధానంలో భౌతికవాద పరిష్కారం భారత దేశానికి సరిపడదని నిర్ణయానికి వచ్చారు. అయితే దీన్ని ఆయన మార్క్సిజాన్ని వ్యతిరేకించడంగా భావించాల్సిన అవసరం లేదని ఆ తరువాత అంబేద్కరిస్ట్ మేధావులు కొందరు వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్టులను ఒక బ్రాహ్మణ సమూహంగా ఆయన గుర్తిస్తూ వచ్చారు. అందుకు కారణం కూడా ఉంది. భారత కమ్యూనిస్టు పార్టీలో ఆధిక్యత వహిస్తున్న బ్రాహ్మణ వర్గం అంబేద్కర్ పట్ల అనుసరించిన అనుచిత విధానం కూడా కమ్యూనిజాన్ని ఆయన వ్యతిరేకించేందుకు దోహదపడిందని చెప్పవచ్చు. ఆరంభకాలంలో భారత కమ్యూనిస్టు పార్టీ నేతల్లో అందరూ అగ్రకుల బ్రాహ్మణకులానికి చెందిన వారే. వారిలో అత్యధికులు ఉన్నత విద్యావంతులు. మార్క్సిజంలోని భావజాలాన్ని వారి ద్వారానే ఎక్కువగా వెలుగులోకి వచ్చింది. వారు బ్రిటిష్‌పాలనలో రాజకీయంగా బాధలు పడిన వారినే గుర్తించారు. ఆసియాలో వలస పాలనలో పెట్టుబడిదారీ విధానం, సామ్రాజ్యవాదాల విషయంలో కమ్యూనిజం పాత్రపై లెనిన్ సిద్ధాంతానికి స్థానిక కమ్యూనిస్టులు తమ విధేయతను ప్రకటించుకున్నారు. సాంప్రదాయ కుల విధానంలో అభివృద్ధి చెందిన వారు, అత్యున్న స్థితిలో ఉన్న వారు వారి పాత ఆలోచనా ధోరణుల్లోంచి బయట పడడం అంత సులభంకాదని అత్యంత కీలక సమయాల్లో భారత కమ్యూనిస్టు పార్టీ నేతలపై అది ప్రభావం వేసిందని అంబేద్కర్ భావించారు.
మార్క్స్ వర్గ సంఘర్షణ సిద్ధాంతాన్ని భారత దేశంలో అమలు చేయడానికి అనువుగా ఉందని, భారతీయ సామాజిక చరిత్రే ఇందుకు నిదర్శనమని అంబేద్కర్ భావించాడు. వర్గానికి హిందూ సాకేతిక నామమే వర్ణం. మార్క్స్ వర్గ వైరుధ్యం అంటాడు. అంబేద్కర్ వర్ణ వైరుధ్యం అంటాడు. మార్క్సిస్ట్ సిద్ధాంతం పూర్తిగా ఆర్ధిక అసమానతలను వివరిస్తే….అంబేద్కర్ కులం ఆధారంగా ఆర్ధిక అసమానతలను ప్రస్తావించాడు. అంబేద్కర్ భారతీయ చారిత్రక మూలాల్లోకి వెళ్లి బ్రాహ్మణత్వం, బుద్ధత్వం మధ్య వైరుధ్యాలను అధ్యయనం చేశాడు. భారతీయ సమాజానికి అన్వయించాలని ప్రయత్నించాడు. చారిత్రక, సామాజిక సంబంధాల్లోని వాస్తవికత, సృజనాత్మకత, అణచివేతకు గురువుతున్న ప్రజల ఈతి బాధలు, వాటికి మానీవయ కోణంలో పరిష్కారం వంటి క్షేత్ర స్థాయి అంశాలపై అంబేద్కర్, మార్క్స్ భావాల్లో అనేక సారూప్యతలున్నాయి.
1930 ఆరంభ దశలో కమ్యూనిస్టు పార్టీ భారత్‌లో ఒక ఆధునిక భావనగా స్వాతంత్ర పోరాటంలో భాగం అవుతూ వచ్చింది. 1936లో 'దత్ – బ్రాడ్లీ సిద్ధాంతం' పేరుతో బ్రిటిష్ కమ్యూనిస్టు సిద్ధాంత వ్యాసం బయటకు వచ్చింది. దీనిలో 'భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలతో ఒక ఐక్య పోరాటాన్ని నడుపుతోందని, దాన్ని అనుసరించాలని' ప్రతిపాదించింది. ఇది అంబేద్కర్‌ను కమ్యూనిస్టు పార్టీ నుంచి పూర్తిగా దూరం చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటికి జాతీయోద్యమం పట్ల అంబేద్కర్ పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నాడు.
బ్రిటిష్ పాలన అంతమవడమంటే భారత దేశంలో హిందూ ఉన్నత కులాలు తమ ప్రజలను కుష్టురోగులను చూసినట్లు హీనంగా చూస్తారని భావిండమే ఆయన జాతీయోద్యమంలో భాగం కాలేక పోవడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ కోణంలోనే కమ్యూనిస్టు పార్టీ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం చేయడమంటే అది కొంత మంది బ్రాహ్మణులు తమ ఉన్నత స్థితిని కాపాడుకునే కుతంత్రంలో భాగమేనని ఆయన భావించారు. ఈ కోణంలో నుంచి మొత్తంగా శాస్త్రీయ మార్కిస్ట్ పరిష్కారాన్ని విబేధిస్తూ దానికి దూరంగా ఉండాలని మొండిగా ఒక నిర్ణయానికి వచ్చేశాడు. అదే సమయంలో తనలోని హిందూ వ్యతిరేకత, భారతీయ కమ్యూనిస్టులతో విబేధం… అన్నింటికి ప్రత్యామ్నాయంగా అన్యమనస్కంగానే బుద్ధిజంను అధ్యయనం చేయడానికి ఉపకరించాయని, దాన్ని అనుసరించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు అర్ధమవుతోంది.
భారత కమ్యూనిస్టుపార్టీ అసంకల్పిత, అనుచిత, ఆనాలోచిత నిర్ణయాల కారణంగా హిందూ పాలకవర్గాలతో తలపడే ఒక మేధావి, ఒక సాహసి, ఒక ధీశాలిని కోల్పోయిందని చెప్పకతప్పదు. కమ్యూనిజం విధాన సైద్ధాంతికతను సక్రమంగా అర్ధం చేసుకుని, భారత దేశ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కులానికి ప్రధాన్యత ఇచ్చి అంబేద్కర్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించి ఉంటే ….. నాడే భారతదేశం కూడా ఫ్యూడల్, పెట్టుబడి బంధాలను తెంచుకుని విముక్తి దిశగా పయనించి ఉండేదన్న భావన ప్రస్తుతం కమ్యూనిజాన్ని అభిమానించే అనేక మందిలో బలంగా ఉంది.
ఈ దేశంలో కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అంబేద్కర్ వాదాన్ని ఆచరణలో అన్వయించుకుని కమ్యూనిస్టులు సాగినప్పుడే దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది.
— రాజుపాలెం రాజు, సబ్ ఎడిటర్, సెల్ : 9515787335