మాతృభాషలో విద్య ఆ జాతి ప్రజల ప్రజాస్వామిక హక్కు

“మాతృభాషను మరచిన విద్య …….. కిటికీలు లేని భవనం లాంటిది” – జాతిపిత మహాత్మా గాంధీ “భారతీయ విద్యకు తీవ్రమైన పునఃనిర్మాణం కావాలి. దాదాపు ఒక విప్లవమే రావాలి…. కొఠారి కమీషన్ (1964-66) సామ్రాజ్యవాద వలస దోపిడి తుపాకీ శరీరాన్ని లొంగదీసుకుంటే భాష మెదడును వశం చేసుకుంటుంది.” భాష, సంస్కతిపై అధిపత్యం ద్వారా ఆర్థిక దోపిడీని, రాజకీయ పెత్తనాన్ని నిరంతరం కొనసాగించాలని వలస వాదులు నిత్యం ప్రణాళికలు రూపొందిస్తారు. గూగి వాధియెంగో ప్రఖ్యాత ఆఫ్రికన్ ప్రజారచయిత కామన్ స్కూల్ విధానంలో నడిచే నైబర్ హుడ్ పాఠశాలలు సామాజిక అంతరాలను తొలగిస్తాయి.


– కొఠారి కమీషన్.


కొద్ది నెలలు క్రితం క్రొత్తగా కొలువు తీరిన జగన్ ప్రభుత్వం అమ్మఒడి, ఇంగ్లీషు మీడియం చదువులతో అద్భుతాలు సృష్టిస్తానంటూ హడావిడి చేస్తూ ఉంది. దశాబ్దాల పాటు అటు దేశాన్ని ఇటు రాష్ట్రాలను పాలించిన కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దేశ ప్రజలకు సార్వత్రిక విద్యను అందించలేక పోయింది. దేశ స్వాతంత్ర్యానంతరం 10 సంవత్సరాలకే సార్వత్రిక విద్యను సాధిస్తామని లక్ష్యంగా పెట్టుకున్న జాతీయ కాంగ్రెస్ ఆచరణలో పూర్తిగా విఫలమైంది. సార్వత్రిక విద్య నేటికి ఓ ఎండమావిగా మిగిలిపోయింది. అలాంటిది పిల్ల కాంగ్రెస్ పార్టీ వచ్చే విద్యా సంవత్సరం 2020-21 నుండి 1-8వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంలోనే బోధించాలని నిర్ణయించింది. ఈ మేరకు జీవో-81 కూడా విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుండి 1-8వ తరగతి విద్యార్ధులందరూ ఆంగ్ల మాధ్యమంలోకి మారిపోవాలి. ఇది ఓ గొప్ప చర్యగా కూడా ప్రచారం మొదలు పెట్టింది. దీనిపై విద్యార్థి, ఉపాధ్యాయ, సంఘాలు, విద్యా వేత్తలనుండి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కనీసం మానసిక నిపుణులు, విద్యా వేత్తలు, భాషావేత్తలతో చర్చలు కూడా చేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. ఈ చర్య సరైంది కాదని కొద్దిపాటి విద్యా పరిజ్ఞానం ఉన్నటువంటి వారు కూడా చెబుతారు. పైపెచ్చు ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకిస్తున్న వారిపై “మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు” అంటూ ఎదురు దాడికి దిగింది. జగన్ ప్రభుత్వం అయ్యా జగన్ గారూ విధానాలు ముఖ్యం, తాయిలాలు కాదు. మీకు నిజంగా విద్య మీద అంత ప్రేమే ఉంటే పేదపిల్లలకు విద్యను పూర్తిగా అందుబాటులోనికి తీసుకురావాలనుకుంటే ముందుగా ప్రవేటు రంగంలో విద్యా వ్యవస్థను నిషేధించండి. తద్వారా విద్యా వ్యాపారాన్ని అడ్డుకోండి. విద్యా వ్యవస్థను కె.జీ నుండి పీ.జీ వరకు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోండి. ఈ చర్య వలన 99% పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. అలాగే వైద్య రంగాన్ని కూడా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోండి. తద్వారా వైద్యం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అమ్మఒడి, ఆరోగ్యశ్రీ, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఫీజుల రీఎంబర్స్ మెంట్ లాంటి తాయిలాలు అవసరమే ఉండదు. ఈ రెండు పనులు చేస్తే రానున్న కాలంలో మీరే ముఖ్యమంత్రిగా ఎన్నికలలో గెలుస్తారు. జ్యోతిబసు (పశ్చిమ బెంగాల్) రికార్డును బద్దలు కొడతారు. తాత్కాలిక ఉపశమనాలు పైపూత పథకాల వల్ల ఉపయోగం ఉండదని గుర్తించండి.


పసి మొగ్గలకు విద్య, బాల్యం భారం కారాదు. ప్రతి పిల్లవాడికి చిన్న నాటి జ్ఞాపకాలు మధురంగా ఉంటాయి. ఎక్కువ మంది స్నేహితులు వారితో కలసి చేసే బోలెడు అల్లరి, సరదా చిలిపి పనులు, చెట్టుపుట్ట, వాగులు, వంకలు అన్నీ వారివే విచిత్ర ఆలోచనలు అవధులు లేని ఊహలు ఆకాశానికి ఎగరాలన్న ఆశలు, కల్మషం లేని నవ్వులు కేరింతలతో గడిచిపోతుంది. ఎవరి బాల్యమైన దాదాపు ఇదే తీరున ఉంటుంది. పెద్దవారైన ఈ చిన్ననాటి జ్ఞాపకాలు, ఊహలు జగత్తును ఎవరూ మరచిపోరు. ఈ తీపి జ్ఞాపకాల బాల్యాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటారు. అందుకే గీజుబాయి పిల్లలకు ఇష్టమైన ఆటపాటల ద్వారానే చదువు చెప్పాలంటాడు. పిల్లలు సినిమాలకు షికార్లకు ఎంతో ఉత్సాహంగా వెళతారో పాఠశాలలకు కూడా అలా పరుగెత్తాలంటాడు. బాల్యం ఇలా ఎదగాలి. అంతేగాని అసలు వారికి ఏమాత్రం పరిచయం లేని ఈ సమాజపు జీవన విధానం, సంస్కృతి చదువుతో సంబంధంలేని ఒక విదేశీ పరభాషలో చదువులు చెప్పటం అంటే వారిని ఖచ్చితంగా శిక్షంచటమే. ఒకటో తరగతి నుండే ఇంగ్లీషు మీడియం చదువులు అంటూ అభం శుభం తెలియని


పసిపిల్లలపై దాడి చేయటమే ఇది మరో రకంగా బాలల హక్కుల ఉల్లంఘనే, ఈ పిల్లల హక్కుల హననాన్ని ఎవరు ప్రశ్నించరు. ఈ పరాయి భాషే కాకుండా ప్రైవేటు తరగతులు స్టడీ అవర్స్, స్పెషల్ క్లాసులంటూ నిత్యం వారిని శిక్షిస్తారు. అందుకే పిల్లలు ఆత్మహత్యలు నేడు నిత్యం పెరిగిపోతున్నాయి. ఇంత చేసిన వారికి లభించేది వారి వికాసానికి ఏమాత్రం పనికి రాని విలువలు లేని చదువే. పిల్లలను ఆడిస్తూ పాడిస్తూ అనునయిస్తూ ఐన్ స్టీన్ సాపేక్ష సిద్ధాంతము, న్యూటన్ గమన సూత్రాలు, మార్క్స్ మిగుల విలువ సిద్ధాంతము, డార్విన్ జీవ పరిమాణ సిద్ధాంతము ఇలా ఏదైన వారు ఆడుతూ, పాడుతూ అలవోకగా నేర్చుకొంటారు. కాబట్టి మొత్తం బోధన కె.జీ నుండి పీ.జీ వరకు అమ్మ భాషలోనే సాగాలి. అప్పుడే పిల్లల్లో దాగిన సృజనాత్మకశక్తి బయటకు వస్తుంది. వారి మేధస్సు వికశించి భవితకు బంగారు బాటలు పడతాయని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. ప్రపంచ దేశాలన్ని తమ మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నాయి. అద్భుత విజయాలు సాధిస్తున్నాయి. అంతే కానీ ఇంగ్లీషు రాకపోతే విద్యార్థులు విజ్ఞానశాస్త్రం గణితశాస్త్రం నేర్చుకోలేరు అన్నది వాస్తవం కాదు. విజ్ఞానశాస్త్ర భావనలు ఒక భాషకు ఒక సంస్కృతికి పరిమితమైనవి కావు. రష్యన్లు, జర్మన్లు, ఫ్రెంచి, జపాన్ వారు ఇంగ్లీష్ భాష ప్రమేయం లేకుండా మంచి విజ్ఞాన శాస్త్ర నూతన ఆవిష్కరణలు చేశామని సగర్వంగా చెప్పుకొంటారు. 1212 ప్రాంతంలో గణిత విజ్ఞానశాస్త్ర అధ్యయనంలో ఉత్తమ విద్యాభోదన చేసి మొదటి 10 స్థానాలు సాధించిన దేశాలలో 9 దేశాల మాద్యమం ఇంగ్లీష్ కాదు. పైపెచ్చు ఈ దేశాలు ఆసియాఖండములోనివి. వీటిలో భారతదేశం లేదు. కాని ప్రాచీన భారతంలో ఎన్నో అద్భుత ఆవిష్కరణలు జరిగాయి. 'సున్నా' ను కనుగొన్నది మనమే బ్రహ్మగుప్తుడు (విక్రమాదిత్యుని కాలంలో) న్యూటన్ కంటే ఎంతో ముందే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పాడు, ప్లాస్టిక్ సర్జరీ, ఆయుర్వేద వైద్య విధానాలు కనుగొన్నది మనమే ఆ తరువాత అరబ్బు ప్రపంచ విజ్ఞానశాస్త్ర రంగంలో పురోగతి సాధించింది. 'యునాని' లాంటి వైద్య విధానం కూడా అరబ్బులు కనుగొన్నారు. ఈ పరిశోధనలు ఆవిష్కరణలు అన్నీ ఇంగ్లీష్ భాష లేకుండా జరిగాయి. అసలు అప్పటికి ఇంగ్లీషు భాషే పుట్టలేదు.


ప్రపంచ వ్యాప్తంగా అనేక సార్లు ఋజువైన విషయం ఏమిటంటే మాతృభాష మాద్యమంగా విద్యలో సాధించిన విజయాలు ఒక పరభాష మాద్యమంలో ఏ మాత్రం సాధించలేము అని పిల్లలు ఇంట్లో తన పరిసరాలలో మాట్లాడే భాషలోనే చాలా తేలిగ్గా తమ భావాలు వెల్లడి చేస్తారు. భావవ్యక్తీకరణ, నైపుణ్యం, సృజన, ప్రశ్న, తార్కికత, హేతువు ఇవన్నీ రెట్టింపుగా ఉంటాయి. ఉదా : ఓ పల్లెలో ఒక వెన్నెల రాత్రి పిల్లలంతా వీధిలో ఆటలాడుతున్నారు. ఇంతలో ఒక నల్లని మేఘం చంద్రుడిని కప్పివేసింది. వెన్నెల పోయింది. వారి ఆట ఆగిపోయింది. అప్పుడు నాలుగు సంవత్సరాల బుడతడు అరుగుమీద దుప్పటి కప్పుకొని కూర్చున్న తాత దగ్గరకు పోయి “తాత! చందమామకు చలివేసింది ? నల్లటి దుప్పటి కప్పుకున్నాడా? ” అని ప్రశ్నించాడు”. ఏమి చెప్పాలో తెలియని తాత ఆ బుడత తెలివికి, ప్రశ్నకు ఆ ఆలోచనకు మురిసిపోయాడు. ఈ ఘటన విశ్లేషించి చూస్తే నాలుగు సంవత్సరాల బుడతడికి ఈ క్రింది సామర్థ్యాలు ఉ న్నాయని మనం గ్రహించవచ్చు.


పరిశీలించటం, విశ్లేషించటం, పోల్చటం, ప్రశ్నించటం భావ వ్యక్తీకరణ, జ్ఞప్తికి తెచ్చుకోవటం, గుర్తించటం, హేతుబద్ధంగా ఆలోచించటం, ఊహించటం, సృజనాత్మకత మొదలగు అంతర్గత శక్తులు కలిగి ఉన్నాయి. ఇలాకాక పరాయి భాష అయితే బాల్యంలోనే వారి ఊహాశక్తిని, సృజనను ఆలోచనలను సంకెళ్ళు వేయటమే అవుతుంది. వారు మరమనుషులుగా తయారౌతారు. ముందు పిల్లలు పరాయి భాష నేర్చుకోవటానికే ఎన్నో ఏళ్ళ వృధా చేస్తారు. అదికాక ఒక విదేశీ భాషను నేర్చుకోవాలంటే అమ్మ భాషపై పిల్లలకు మంచి పట్టు ఉండాలి. ముందు మాతృభాష నేర్చుకుంటే ఏ పరాయి భాషలైన మూడు, నాలుగునెలలో నేర్చుకుంటారు అని శాస్త్రీయంగా నిరూపించబడినది. ఇక్కడ ఆంగ్ల భాష నేర్చుకోవటానికి ఎవరూ అభ్యంతరము చెప్పటము లేదు. ఇంగ్లీష్ భాషను ఒక భాషగా నేర్చుకోవాలి కాని, సైన్స్ విజ్ఞాన శాస్త్రాల ద్వారా ఇంగ్లీష్ నేర్పుతాము అంటే ఇంతకంటె అజ్ఞానం లేదు ఇది అశాస్త్రీయం. ప్రపంచంలో ఎక్కడ ఇటువంటి విధానం లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మైనార్టి దళిత బహుజనులలో నుంచి వచ్చిన 'అబ్దుల్ కలాం, అంబేద్కర్ ప్రస్తుత పాఠశాల విద్యా కమీషనర్ గారైన వాడరేవు చినవీరభద్రుడు, చివరకు ఇంగ్లీష్ మీడియం బ్రిటిష్ పాట పాడుతున్న కంచె ఐలయ్య మొదలగువారు దారిద్ర్యం కటిక పేదరికం నుండి వచ్చినవారే. కత్తి పద్మారావు వీరు వారి మాతృభాషల్లో చదవటం వల్లనే జీవితంలో పైకి వచ్చారు. సమాజానికి మేలు చేశారు. చేస్తున్నారు. కాబట్టి మాతృ భాషైన తెలుగును అభివృద్ధి పరచాలి. సమస్త విజ్ఞానం శాస్త్రాలను తెలుగు భాషలో అనువదించాలి. 9 కోట్ల మంది తెలుగు ప్రజల భాష అయిన తెలుగులోనే విద్య పరిపాలన సాగాలి.


1990 తరువాత నూతన ఆర్థిక విధానాల పేరిట దేశం సామ్రాజ్య వాదుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మన సంస్కృతి అణచివేయబడింది. ఇంగ్లీష్ విద్య వ్యాపారమై, అంగడి సరుకై భావి పౌరులు మరుగుజ్జులుగా, మరమనుషులుగా తయారవుతున్నారు. తెలుగు సమాజం నుంచి గత 20 సంవత్సరాలుగా మంచి నాణ్యమైన రచయితలు, రచనలు రావటం లేదు. ఇది మన తెలుగు సమాజం తమ భాషను, సంస్కృతిని వదిలివేసింది. మరియు ఆ సమాజం రోగగ్రస్తం అయింది. అనటానికి ఒక చిహ్నం. తెలుగు సమాజానికి కావలసిన సోషల్ ఇంజనీర్స్ తెలుగు సమాజంలోని కళాశాలలు, విశ్వ విద్యాలయాల నుంచి రావటం లేదు. తెలుగు సమాజం నుంచి మంచి పరిశోధనలు కూడా రావటం లేదు. ఈ పరిస్థితి తెలుగు సమాజానికి ఎంతో హానికరం. నష్టదాయకం. 1990 నుంచి తెలుగు సమాజంలో ఇంగ్లీష్ మీడియం చిన్నగా రుద్దబడింది. వ్యక్తి పరాయికరణ మొదలైంది. భాష మీద పట్టులేక చరిత్ర, సంస్కృతి మీద అవగాహన లేక భావితరం నిర్వీర్యమైపోయింది. ఈ కాస్టి ఇంగ్లీష్ చదువులు బానిసలను ఉత్పత్తి చేసింది. ఈ బానిసల్లో భారతీయ స్పృహలేకుండా పోయింది. వీరు డాలర్స్ డ్రీమ్స్ లో విదేశాలకు ఊడిగం చేయటానికి ఈ ఇంగ్లీష్ పక్షులై ఎగిరిపోతున్నారు. వారి తల్లి దండ్రులను ఇక్కడ వృద్ధాశ్రమాలలో వదలిపెట్టిపోతున్నారు. ఇంతకంటె వ్యక్తి పరాయికరణ మరేముంటుంది. జ్ఞానం లోపించిన ఇంగ్లీష్ చదువులు మనిషిని, మానవీయతను చంపేస్తున్నాయి. దేశం ఇంతగా కునారిల్లటానికి కారణం అవుతున్నాయి. దేశ భవిషత్ తరగతి గదిలో రూపొందకుండా వచ్చీరాని పరాయి భాషలో కొట్టుకుపోతున్నది. ఇది దేశానికి మంచిది కాదు. అసంబంధమైన విద్యా వ్యవస్థ, చదువులో స్థాయి లేకపోవటంతో జ్ఞానం లోపించిన విశ్వవిద్యాలయ పట్టాలు చేతిలో ఉంటున్నాయి కాని విద్యార్ధి అక్షరాస్యుడుగా మాత్రమే కళాశాలలు విశ్వవిద్యాలయాల నుంచి బయటకు వస్తున్నాడు. జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్య గల మూలాలను అర్థం చేసికోలేక పోతున్నాడు. జీవితం చీకటిమయం అనుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు. చదువంటే జ్ఞానం. ఈ జ్ఞానమే మనిషిని, దేశాన్ని నిలబెడుతుంది. ప్రపంచంలో ఏదేశం కూడా పరాయి భాషలో తమ బిడ్డలకు చదువు చెప్పటం లేదు. మరి మనమెందుకు ఇంగ్లీష్ భాష మోజులో కొట్టుకుపోతున్నాము. పాలకులు ఎందుకు ఇంగ్లీష్ ను ప్రోత్సహిస్తున్నారు అంటే వీరి దుష్ట పాలనా విధానాలు దోపిడీని ప్రజలు అర్థం చేసుకోకుండా మరియు ప్రశ్నించకుండా ఉండాలి అంటే ప్రజల్ని అజ్ఞానంలోనే ఉంచాలి. అందుకు భావం అర్థం కాని వేస్టు చదువులలో ప్రజలు కొట్టుకుపోవాలి. పాలకుల దోపిడి నిరంతరము కొనసాగాలి. అందుకే బ్రిటీష్ వారు ఆంగ్లమాద్యమాన్ని ప్రవేశపెట్టారు. వారికి కావలసిన గుమస్తాలను తయారుచేసుకున్నారు. మన పాలకులు కూడా స్వాతంత్ర్యానంతరం బ్రిటీష్ అధికారి 'మెకాలే' విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే పాలకులు చేసే కుట్రే ఇంగ్లీష్ మీడియం చదువులు. ఈ దృక్పథం నుంచి ఆలోచిస్తే కాని ఇది మనకు అర్థం కాదు. సంస్కృతి వాహికగా, ప్రజల జీవన విధానంలో చరిత్రలో విలువల సంపుటిగా ఒక జాతి భాషను అర్థం చేసుకోవాలి. మాతృభాషలేని జాతులు ఎక్కడా ఉండవు. ఒక భాష అంతరిస్తే ఒక సంస్కృతి ప్రమాణంగా ఆ జాతి నశించిపోయినట్లే భావించాలి. వేరే ఏదో పరాయి భాష, ఇతర సంస్కృతి వారిని జయించి ఉంటాయి. అవి ఆ జాతికి నిజంగానే ఘోర విపత్తు. ఇప్పుడు ఈ విపత్తు నుండి తెలుగుజాతిని కాపాడుకోవాలి.